Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Aavakaaya Special

అహంకారమా? అత్యుత్సాహమా?

By Kamala M, Jun 24 2009 9:40AM

రెండు రోజుల కిందట టూ వీలర్లో వెళ్తున్నాను. నేనే డ్రైవ్ చేస్తున్నాను. కొద్దిదూరంలో రోడ్డుకు పక్కగా ఇద్దరు అబ్బాయిలు ఆడుకొంటున్నారు. వాళ్ళని అలర్ట్ చేద్దామని హారన్ కొట్టి, నెమ్మదిగా వెళ్ళబోయాను. నేను దగ్గరికి రాగానే ఒక కుర్రవాడు సర్రుమని అటునుండి ఇటుకి పరుగెట్టుకొచ్చాడు. అంతేకాక "పోవే పోవే" అని అరిచాడు. ఇంతచేసీ వాడి వయసు ఆరేడేళ్ళు ఉంటాయి అంతే. వాడికి జోడీగా రెండో అబ్బాయి కూడా "ఓ ఓ ఓ" అని అరవడం వినబడింది. నేను పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయాను...ఆ అబ్బాయిలది అహంకారమా లేక అత్యుత్సాహమా అన్న ఆలోచనతో!

"మన పిల్లలు" అన్న గుడ్డి అభిమానం విడిచి చూస్తే ఈతరం పిల్లల్లో నిర్లక్ష్యం చాలా మందంగా పేరుకుపోయింది. విపరీతమైన హైపర్ యాక్టివిటీతో వాళ్ళు సతమతమౌతున్నట్టు అనిపిస్తుంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లలు ఏం చేస్తున్నదీ పట్టించుకొనే తీరిక తక్కువగా ఉండడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం జరుగుతోంది.

అసహనం అన్నది రోజువారి జీవితంలో ప్రధానభాగమైపోయింది. "ఈ పని చేయండర్రా" అని చెబితే మొహమ్మీదే విసుక్కొనే పిల్లలున్నారు. బదులు ఇవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళూ ఉన్నారు.

టీవీ, సినిమాల ప్రభావంతో వాళ్ళకేదో చాలా తెలుసుననే ఫాల్స్ ప్రిస్టేజ్ పిల్లల్లో ఎక్కువౌతోంది. పాతకాలం సినిమాల్లో పిల్లల పాత్రలు పిల్లల్లానే వ్యవహరించేవి. కొత్తతరం సినిమాల్లో పిల్లలే పెద్దవాళ్ళకు సలహాలిచ్చే స్థాయికి ఎదిగిపోయారు.

నాయికా నాయకులకు వాళ్ళే లవ్ టిప్స్ ఇస్తారు. ఎడమొహం, పెడమొహం పెట్టుకొన్న భార్యాభర్తలను ముద్దులు పెట్టుకొనేట్లు చేస్తారు. బామ్మలను, అమ్మమ్మలను వెకిలి ఆటలు పట్టిస్తారు. మిగతావాళ్ళకు తలకు చెప్పులడిగే రీతిలో బదులిస్తారు. రీల్ లైఫ్ పిల్లల్నే రియల్ లైఫ్ పిల్లలు అనుకరిస్తున్నారనడంలో సందేహం లేదు కదా!

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb