Home | My aavakaaya | Submit a Link | New User Registration | Make aavakaaya.com my home page! | Search aavakaaya Sign In

Editor's Pick

కవిత్వం గురించి కొన్ని మాటలు

By Alok Vastav, Apr 1 2010 2:11AM

ఆ మధ్యన బుచ్చిబాబు "చివరకు మిగిలేది" గురించి కొన్ని వ్యాసాలొచ్చాయి. వాటికి కొనసాగింపుగా కామెంట్లూ వొచ్చాయి. కొంచెంమందికి "చివరకు మిగిలేది" వొట్టి కధలా అనిపిస్తే కొంచెంమందికి కవితాత్మక వచనంగా కనిపించింది. యిప్పుడు నే రాస్తున్నది చివరకు మిగిలేది గురించి కాదు. కవిత్వం గురించి. కవిత్వంలా అనిపించే వచనం గురించి.

కవిత్వం-వచనం వేరువేరని యిప్పటికే చాలాసార్లు అనేసుకొన్నాం. గానీ మన తెలుగు వీరబాహులు చాలామంది వచనాన్నే కవిత్వమని బుకాయించి చెలామణి చేయిస్తూనేవున్నారు.

దీన్నలావుంచి మళ్ళీ కవిత్వం - వచనం గురించి ఆలోచించి చూస్తే కొన్ని విషయాలు గట్టిగా చెప్పాలనిపించింది.

వచనం ప్రధానంగా సాగేవి కధ, వ్యాసం, నాటికలు వగైరా. యీ విభాగాల్లో వచనం యెల్లా పనిజేస్తోందో కొంచెం తెలుసుకొంటే కవిత్వాన్ని వడగట్టే సాధనం పట్టుబడుతుంది. కధల్లో గానీ నాటికల్లో గానీ వుండేవి సంఘటనలు. ఒక క్రమంలో అమర్చిన సంఘటనలని చెప్పుకోవొచ్చు. ఈ సంఘటనలు కల్పితాలు గావొచ్చు, వాస్తవమూ గావొచ్చు. వో కధని చెప్పేటప్పుడు కధకుడు సంఘటనలకే యెక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. కొన్ని పాత ఘటనల సహాయంతో పాత్రల్లో యెప్పటికప్పుడు జరిగే ఆత్మ సంఘర్షణల్ని వర్ణిస్తాడు. యీ వర్ణనల్ని చదువుతున్నప్పుడు పాఠకులు ఉత్తేజానికి గురౌతారు. అది కల్పితమైన ఘటనైనా, వాస్తవమైన ఘటనైనా రచైత సామర్ధ్యాన్ని బట్టి యీ ఉత్తేజం కలుగుతుంది. యీ ఉత్తేజం తాత్కాలికం. కధ చదివినంతసేపో లేక కొద్ది రోజులో మాత్రమే! గమనించి జూస్తే ఉత్తేజం వొక శారీరిక స్పందన మాత్రమే.

కవిత్వంలోకొచ్చేసరికి సాదాసీదా వాక్యాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. మారిపోవాలి కూడా. కవిత్వం పాఠకులకి ఉత్తేజాన్ని మాత్రమే కలగనివ్వదు. వ్యక్తిగతమైన భావస్పందన్ని కూడ కలిగిస్తుంది. యీ కదలిక మానసికమూ, శాశ్వతమూ అయివుంటుంది.

Add to Social Bookmarking sitesAdd to BlogmarksAdd to DeliciousAdd to DiggAdd to FurlAdd to FarkAdd to NewsvineAdd to RedditAdd to ShadwosAdd to SpurlAdd to WistsAdd to Yahoo MyWeb