|
|
|
అధ్యాయం 3- పల్నాటి వీరభారతం
బ్రహ్మనాయుని భార్య ఐతాంబ. మహాసాధ్వి. ఐతాంబలాంటి స్త్రీలు బాలచంద్రుడిలాంటి మహావీరుల్ని కనకపోతే, తెలుగుల చరిత్రలో విలువైన, వెలలేని వీరసాహిత్యం లభించకపోయివుండేదేమో?
ఎంతకాలానికీ పిల్లల్లేని బ్రహ్మనాయుడి భార్య, చెన్నకేశవుణ్ణి మొక్కుకుని, గజనిమ్మపళ్ళ వ్రతం చేస్తే - లేకలేక కల్గిన బిడ్డడు బాలచంద్రుడు.
చరిత్ర నమ్మలేని కొన్ని కథల్ని ఇక్కడ ఉటంకించడం అవసరమని భావించాలి.
నిజానికి బాలచంద్రుడు పుట్టిన క్షణాలు మంచివిగావని పల్నాటి నాలులేరు పొంగి, పల్నాటినంతా ముంచెత్తిందట.
బ్రహ్మనాయుడు దైవజ్ఞులను పిల్చి, కొడుకు జాతకాన్ని పరిశీలింపజేసాడు. దైవజ్ఞులు చెప్పిన సారాంశమిది - "పుట్టినవడు పెరిగి పెద్దవాడైతే, పల్నాటి చరిత్రలో రక్తపుటేరులు పారుతాయనీ, ఐనా ఇతగాడు మహావీరుడనీ" నిర్ధారించారు.
పుట్టిన బిడ్డడు పల్నాటినంతా వేడుకల్తో ముంచెత్తుతుంటే, పిల్లవాడి తండ్రి ఏకాంతమందిరంలో, ఆలోచనల్తో విలవిల్లాడిపోతున్నాడు.
ఎన్నో నోములు నోయగా లేకలేక కల్గిన బిడ్డ. కానీ ఈ పుట్టిన బిడ్డ పల్నాటినాట రక్తప్రవాహాన్ని సృష్టిస్తాడట.
పల్నాటి సౌభాగ్యానికి - పితృప్రేమకు మధ్య చిక్కిన బ్రహ్మనాయుడి ఆత్మ తలకిందులవుతున్నది.
- పల్నాడా? కన్నబిడ్డడా?
|
| | |
|
|