|
|
|
అధ్యాయం 4-పల్నాటి వీరభారతం
అనుగురాజు తర్వాత పల్నాటి ప్రభువైన నలగామరాజు కూతురు పేరిందేవి. నలగామరాజుకు పేరిందేవి ఏకైక సంతానం.
పల్నాటికంతా అందమైన పిల్ల. నాయనమ్మ మైలమాదేవి దగ్గర ఆ పిల్లకు గారాబమైతే, చిన్నాన్న నరసింగరాజు పేరిందేవిని కంటికి రెప్పల్లే చూసుకుంటాడు.
(నలగామరాజూ భార్య మరణించి ఉండాలి. పేరిందేవి తల్లిని గురించి, పల్నాటి చరిత్రలో ఎక్కడా, ఎవరూ ఉటంకించలేదు. నిజానికి నలగాముని భార్య మరణిస్తే అది చాలా విచారించాల్సిన విషయమే. ఇవ్వాళ ఆవిడ పేరిందేవి ముద్దు పలుకులు వింటానిక్కానీ, ముద్దు చేష్టల్ని చూడ్డానిగ్గానీ లేదు.)
ఇప్పుడు పేరిందేవికి ఆరేళ్ళు. ఇల్లంతా కళకళలాడుతూ తిరుగుతూ ఉంటుంది.
నిజానికి పేరిందేవికి తండ్రి దగ్గరకన్నా చిన్నాన్న నరసింగరాజుకు మాలిమి ఎక్కువ.
నలగాముడు తన కూతురు పేరిందేవిని, తన బావమరిది కొమ్మరాజు కొడుకు అలరాజు కివ్వాలని అనుకుంటూ ఉండేవాడు.
మైలమాదేవి నవ్వుతూ - "పేరిందేవీ! మీ బావ అలరాజును చేసుకుంటావా?" అంటే -
చక్రాల్లాంటి కళ్ళని తిప్పుతూ "ఓ...చేసుకుంతాను" అనేది పేరిందేవి.
|
| | |
|
|