|
|
|
బాబ్లీ రాజకీయాల్లో పిడకల వేట
ఎప్పుడూ పదవుల కోసం, అధికారం కోసం రాజకీయాలు నడిపే మన నేతలు మొదటిసారి ప్రజల కోసం రాజకీయాలు నడపటం ముదావహం. ఈ సంతోషానికి మరో కారణం కూడా ఉంది. ప్రజల కోసం ఉద్యమించినప్పుడు, మన ప్రజాస్వామ్య పరిరక్షకులే ఒళ్ళు హూనమయ్యేలా కుళ్ళబొడుస్తారనే ఓ నగ్న సత్యాన్ని అనుభవంతో గ్రహించారు మన తెలుగుదేశం నేతలు. అరకొర వసతుల మధ్య, మరాఠీ లాఠీ దెబ్బలతో దినదిన గండంగా అయిదురోజులు వెళ్ళబుచ్చామని చంద్రబాబు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. ఒక్కసారి లాఠీ ఝలిపించేటప్పటికే, వాతలు తేలిన వీపు చూపిస్తు ఒక నేత, స్పృహ తప్పిన మరో మహిళా నేత, కన్నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ నాయకుడు.... ప్రజా ఉద్యమంలో లోతుపాతులు చవిచూడటం మంచి పరిణామమే కదా!
అధికారంలో ఉన్నప్పుడు, స్త్రీలని, విద్యార్ధులని, బడుగు రైతులనీ లేకుండా అనేకానేక ఉద్యమాలను ఆయనే ఎలా అణచివేసారో కూడా ఆ అయిదు రోజుల్లో ఒక్కసారైనా ఆయనకు గుర్తుకొచ్చి ఉంటుందనే ఆశిస్తాను. అరకొర ఏంటి, అసలు వసతులే లేని ఆంధ్ర లాకప్పుల్లో ఎంతమంది మగ్గిపోతున్నారో కూడా ఆయనకు ఓ అంచనా వచ్చి ఉంటుందనే ఆశిస్తాను. |
| | |
|
|