'కమ్యూనిజం' అనే ఆ పత్రికలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమైన డా.విజయ భారతి గారు ఇంకా ఇలా అంటారు... " ఆదికాలపు అవశేషాలలో బాల్యవివాహాలు ముఖ్యమైనవి" అని. అంతేకాదు "నచ్చిన వరునికి లేదా అర్హుడైన వానికి లేదా ఏదో ఒక పరీక్షలో నెగ్గగలిగినవారికి తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయటం అనేక కథలలో కనిపిస్తుంది" అని కూడా అంటారు రచయిత్రి.త్రేతాయుగంలో సీతకు జరిగిన స్వయంవరం, ఆమె యుక్తవయస్కురాలైన తర్వాతే జరిగింది. ద్రౌపది విషయంలో కూడా ఇలానే జరిగింది. అలాగే రచయిత్రి వ్రాసినట్లు "కృతయుగంలో హరిశ్చంద్రుని వద్దకు మాతంగకన్యలను విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు" అన్నారు. మరి ఆ ప్రకారం కూడా, వారు కన్యలే గానీ, బాలలు కారు కదా! అంటే కృతయుగం కాలం నుండి కూడా బాల్యవివాహాలు లేవు. ఆనాటి చక్రవర్తులు బాల్యవివాహం చేసుకున్నట్లు ఒక్క ఆధారం కూడా లేదు. ఇక ఆదికాలానికి వస్తే, ఆరోజుల్లో వివాహవ్యవస్థే లేదు కదా! అటువంటప్పుడు బాల్యవివాహాలు ఆదికాలపు అవశేషాలు ఎలా అయినాయో?